UAE | దుబాయ్, సెప్టెంబర్ 1: యూఏఈలో అక్రమంగా నివసిస్తున్న వారి కోసం అక్కడి ప్రభుత్వం రెండు నెలల వీసా ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని ఈ నెల 1న ప్రారంభించింది. దీని ద్వారా అక్రమ నివాసితులెవరైనా తమ నివాస స్థితిని (రెసిడెన్సీ స్టేటస్) క్రమబద్ధీకరించుకోవచ్చు లేదా జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్లిపోవచ్చు. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం(సీజీఐ) ఒక అడ్వైజరీ జారీ చేసింది. దాని ప్రకారం..
1. భారత్‌కు తిరిగి వెళ్లాలనుకొనేవారు ఎమర్జెన్సీ సర్టిఫికెట్(ఈసీ) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ నివాస స్థితిని క్రమబద్దీకరించుకోవాలనుకొనేవారు స్వల్ప కాల పరిమితి పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ఈసీ కోసం ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దుబాయ్‌లోని సీజీఐ, అవిర్ ఇమ్మిగ్రేషన్ సెంటర్లో సమాచార కేంద్రాలు ఏర్పాటవుతాయి. భారత రాయబార కార్యాలయంలోని సమాచార కేంద్రం ఈ నెల 2 నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుంది.
3. దరఖాస్తుదారులు దరఖాస్తు సమర్పించిన మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య దుబాయ్‌లోని సీజీఐ నుంచి తమ ఈసీని తీసుకోవచ్చు.
4. దరఖాస్తుదారులు స్వల్ప కాల పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి దుబాయ్, నార్తన్ ఎమిరేట్స్‌లోని బీఎల్ఎస్ కేంద్రాలను ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండా సంప్రదించవచ్చు. ఈ కేంద్రాలు అన్ని ఆదివారాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి.
5. ట్రావెల్ డాక్యుమెంట్ సమాచారం కోసం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 050-9433111 మొబైల్ నెంబర్లో సంప్రదించవచ్చు. ప్రతి రోజూ 24 గంటలు పనిచేసే పీబీఎస్కె హెల్ప్‌లైన్ 800-46342కు అయినా కాల్ చేయొచ్చు.