John Tyson | ప్రఖ్యాత మాంసం ప్రాసెసింగ్ కంపెనీ సీఎఫ్ఓ జాన్ టైసన్‌ను వాషింగ్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఒంటిపై దుస్తులు లేకుండా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. మద్యం మత్తులో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, అర్కాన్సాస్ రాష్ట్రంలోని ఫాయెట్విల్లే పట్టణంలో నివసిస్తున్న ఒక మహిళ సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా తన బెడ్‌పై పడుకున్నట్లు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె ఇంటికి చేరుకుని సదరు వ్యక్తిని పరిశీలించారు. ఒంటిపై దుస్తులు లేకుండా మంచంపై పడి ఉన్నాడు. అక్కడే ఉన్న ఆయన దుస్తుల్లో లభించిన కాగితాల ఆధారంగా ఆయనను టైసన్ ఫుడ్స్ సీఎఫ్ఓ జాన్ ఆర్ టైసన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై టైసన్ ఫుడ్స్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాఉండగా, జరిగిన సంఘటనపై జాన్ టైసన్ క్షమాపణలు కోరాడు. తప్పు జరిగిందని, ఆలా చేసినందుకు సిగ్గుపడుతున్నానని చెప్పాడు. ఇది ముమ్మాటికీ తన, తన కంపెనీ విలువలకు విరుద్ధమని పోలీసుల ఎదుట చెప్పుకొచ్చాడు.
32 ఏండ్ల జాన్ ఆర్. టైసన్ ప్రఖ్యాత మాంసం ప్రాసెసింగ్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కంపెనీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో రెండో స్థానంలో ఉన్నది. ఈ కంపెనీని జాన్ డబ్ల్యూ టైసన్ 1935 లో స్థాపించారు. ఈయన ముని మనవడే ఈ జాన్ టైసన్. ఈయన తండ్రి జాన్ హెచ్ టైసన్ ప్రస్తుతం కంపెనీ చైర్మన్‌గా ఉన్నారు. ఈ కంపెనీ చికెన్, బీఫ్, పోర్క్ ప్రాసెస్ చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నది.