Indians death | కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయులు మృతిచెందారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వార్తను కెన్యా అధ్యక్షుడి సహాయకుడు ధ్రువీకరించాడు. వీరిద్దరూ నైరోబీలోని క్లబ్ నుంచి గత జూలై నెలలో అదృశ్యమైనట్లుగా తెలుస్తున్నది. కాగా, కెన్యా కిల్లర్ పోలీసులే వారిని హత్య చేశారని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించాడు.
గత జూలై నెలలో కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయుల చనిపోయిన వార్త బయటకు వచ్చింది. వీరిద్దరూ నైరోబీలోని ఓ క్లబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు. కెన్యా అధ్యక్ష ఎన్నికల్లో విలియం రూటో తరఫున ఎన్నికల ప్రచార బృందంలో వీరు చేరినట్లుగా సమాచారం. వీరి మృతి వార్తను కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సహాయకుడు డెనిస్ ఇటుంబి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కెన్యా ‘కిల్లర్ పోలీసులే’ వారిని హత్య చేశారని పేర్కొన్నారు. మృతిచెందిన వారిలో ఒకరు బాలాజీ టెలిఫిల్మ్స్ మాజీ సీఓఓ జుల్ఫికర్ ఖాన్ కాగా, మరొకరు భారతీయ పౌరుడు మహ్మద్ జైద్ సమీ కిద్వాయ్.
ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు వారిద్దరు ట్యాక్సీ కారులో వెళ్తుండగా.. డ్రైవర్‌తో పాటు వీరిని కూడా కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన మూడు రోజుల తర్వాత వారిని చంపినట్లు ఇటుంబి తన ప్రకటనలో పేర్కొన్నారు. కిడ్నాప్ అనంతరం వారిని నైరోబీకి 150 కిలోమీటర్ల దూరంలోని అబేర్డేర్స్కు పంపారని తెలిపారు. వీరి అదృశ్యంపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చితోపాటు బాలాజీ టెలిఫిల్మ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏక్తా కపూర్ కూడా కెన్యా ప్రభుత్వానికి లేఖ రాశారు. వీరి ఆచూకీ కనుగొని భారత్‌కు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు.