Somalia Explosions | ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. మరోవైపు ఆ దేశ రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో పలువురు దుర్మరణం చెందినట్లు సమాచారం.
సోమాలియా కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం సంభవించిన రెండు పేలుళ్లతో సోమాలియా రాజధాని మొగడిషు నగరం కంపించిపోయింది. పలు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఉండే రద్దీ ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లు విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద జరిగాయి. ఈ పేలుళ్లలో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ ఒక్కరూ ప్రకటన జారీ చేయలేదు. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ గ్రూప్ జరుపుతున్న హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చించడానికి సోమాలియా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ అధికారులు సమావేశమైన రోజునే.. ఈ పేలుల్లు జరుగడం విశేషం.
అల్ షబాబ్ తరచుగా హై-ప్రొఫైల్ ప్రదేశాలపై దాడులు చేస్తున్నది. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈసారి పేలుళ్లకు కుట్రపన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2015 లో విద్యాశాఖపై ఒకసారి దాడి జరిగింది. జోబ్ జంక్షన్ వద్ద 2017 లో 500 మందికి పైగా మరణించిన పేలుళ్లకు అల్-షబాబ్ కారణమని తేలింది.