Turkey | వాయువ్య టర్కీలోని ప్రముఖ స్కీ రిసార్ట్‌లోని హోటల్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 66 మంది సజీవదహనమయ్యారని ఆ దేశ మంత్రి అలి యెర్లికాయ పేర్కొన్నారు. మరో 51 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, విలేకరులతో మాట్లాడారు. ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి మెమిసోగ్లు పేర్కొన్నారు. బోలు ప్రావిన్స్‌లోని కర్తాల్కాయ రిసార్ట్‌లోని 12 అంతస్తుల గ్రాండ్ కర్తాల్ హోటల్ రెస్టారెంట్లో తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అధికారులపై కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 234 మంది హోటల్లో ఉన్నారు.
ఇద్దరు వ్యక్తులు భయంతో హోటల్ భవనంపై దూకి మరణించినట్లు గవర్నర్ అబ్దులాజీజ్ అయిదిన్ పేర్కొన్నారు. కొందరు బెడ్షీట్లు, దుప్పట్లను తాడుగా మార్చి గదుల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారని స్థానిక టెలివిజన్ పేర్కొంది. హోటల్లో బస చేసిన సమయంలో తాను నిద్రపోతున్నానని.. ఆ తర్వాత భవనం నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లాలని స్కీ ఇన్స్ట్రక్టర్ నెక్మీ కెప్సెటుతున్ తెలిపారు. అనంతరం 20 మందిని తరలించేందుకు సహాయం చేసినట్లు తెలిపారు. కొద్దిసేపట్లోనే హోటల్ అంతా మంటలు వ్యాపించాయని.. జనాన్ని బయటకు తీసుకువచ్చేందుకు కష్టంగా మారిందని పేర్కొన్నారు. హోటల్లో ఉన్న అగ్నిమాపక వ్యవస్థ పని చేయలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హోటల్లో ఉన్న ఫైర్ అలారం మోగలేదని ఓ వ్యక్తి తెలిపాడు. హోటల్లో ప్రమాదం నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న హోటల్స్‌ను సైతం ఖాళీ చేయించారు.