Earthquake | ఉత్తర జపాన్ తీరంలో సోమవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతనగరమైన అమోరికి సమీపంలోని హక్కైడో తీరంలో రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. సముద్ర ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. దాంతో జపాన్ పసిఫిక్ తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈశాన్య తీరాన్ని 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర జపాన్ అంతటా హక్కైడో, అమోరి, ఇవాటేతో సహా అనేక ప్రాంతాలు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతంలో అణువిద్యుత్ కేంద్రాలు ఉండడంతో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ప్రాంతంలో అణు విద్యుత్ ప్లాంట్ల భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే పేర్కొంది. భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఏమైనా నష్టం జరిగిందా? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.