న్యూఢిల్లీ : ఇప్పటి వరకు ఎవరూ ఊహించని భారీ సునామీ శనివారం జపాన్ను తుడిచిపెట్టేయబోతున్నదా? జపనీస్ బాబా వంగాగా పిలుస్తున్న రోతుత్సుకి భవిష్యవాణి నిజం కాబోతున్నదా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జోరుగా సాగుతున్నది. సోషల్ మీడియాలోనూ దీనిపైనే చర్చ. ఎందుకంటే, మంగా కళాకారిణి అయిన రో తుత్సుకి 2021లో రాసిన కామిక్ బుక్ ‘ది ఫ్యూచర్ ఐ సా’ (నేను భవిష్యత్తును చూశాను)లో జూలై 5న జపాన్ పెను ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నదని రాశారు. గతంలో ఆమె భవిష్యవాణి కరెక్ట్ కావడంతో ఇప్పుడు జపాన్ ప్రజలు వణికిపోతున్నారు. 1995లో కోబో భూకంపాన్ని, 2011లో టొహోకు సునామీని బాబా వంగా సరిగ్గా అంచనా వేశారు. ఈ నెల 3న టొకారా దీవుల్లో 5.5 తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నది. దీంతో పర్యాటకులు తమ జపాన్ పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు. ఇక, మంగా తన భవిష్యవాణిలో జపాన్-ఫిలిప్పీన్స్ మధ్య సముద్రంలో చీలిక వస్తుందని పేర్కొన్నారు. ఈ చీలిక వల్ల సముద్రం ఎగసిపడుతుందని, భారీ అలలు ముంచెత్తుతాయని పేర్కొన్నారు.
2011లో జపాన్ను ముంచెత్తిన సునామీకి ఇది మూడు రెట్లు అధికంగా ఉంటుందని వివరించారు. ఇప్పుడీ ఊహాగానాలను మరింత బలపరుస్తూ సరిగ్గా అదే ప్రాంతంలో భూమి కింద ఏదో జరుగుతున్నదని శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం.. టెక్టానిక్ ప్లేట్లు ఒకదాని కింద ఒకటి క్రమంగా కదులుతున్న నాన్కాయ్ ట్రఫ్‌లో నిశ్శబ్ద భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే, ఇవి చాలా చిన్నవి అయినప్పటికీ భవిష్యత్తులో సంభవించబోయే పెను భూకంపాలకు ఇవి నిదర్శనమని చెప్తున్నారు. నాన్కాయ్ ట్రఫ్‌లో గత 1400 సంవత్సరాలుగా ప్రతి 100-200 ఏండ్లకు ‘మహా భూకంపం’ సంభవిస్తున్నది. తాజాగా 1964లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.1, 8.4గా నమోదైంది. 2011లో సముద్రంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 9 నుంచి 9.1గా నమోదైంది. ఇది జపాన్ను కుదిపి పడేసింది. జపాన్‌లో సంభవించిన అతి పెద్ద భూకంపంగా ఇది రికార్డులకెక్కింది. వచ్చే మూడు దశాబ్దాల్లో నాన్కాయ్ ట్రఫ్‌లో 7 అంతకుమించిన తీవ్రతతో భూకంపం ఏర్పడే అవకాశం 82 శాతం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.