వాషింగ్టన్: ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగుమతులపై విధించిన టారిఫ్‌లను ఆ దేశ ఫెడరల్ కోర్టు అడ్డుకున్నది. ప్రతి దేశంపైనా విస్తృత సుంకాలను విధించే అధికారం ట్రంప్‌కు లేదని ఫెడరల్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేయడమే కాకుండా దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసిన సుంకాలను రద్దు చేసింది. ట్రంప్ తన అధికార పరిధిని దాటి దేశ వాణిజ్య విధానాన్ని తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మార్చివేశారని ఆరోపిస్తూ భారీ సంఖ్యలో దాఖలైన కేసులపై విచారణ జరిపిన న్యూయార్క్‌లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని ట్రంప్ సర్కారుకు చెందిన న్యాయవాదులు చెప్పారు. ప్రస్తుతానికి ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల ముప్పు తొలగిపోయినట్టే. ఒకవేళ మళ్లీ దిగుమతి సుంకాలు విధించాలనుకుంటే.. ఈసారి ట్రంప్ చట్టసభల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తాను విధించిన టారిఫ్‌ల వల్ల ఉత్పత్తిదారులు తమ పరిశ్రమలను అమెరికాకు తరలిస్తారని, దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఫలితంగా ఆదాయం పెరిగి బడ్జెట్ లోటు తీరుతుందని ట్రంప్ పలుమార్లు ఉద్ఘాటించారు.
ఒక రకంగా దిగుమతి సుంకాలను భారీగా పెంచడం ద్వారా ఆయా దేశాలను వాణజ్యపరంగా లొంగదీసుకొని తనకు అనుకూలంగా ఒప్పందాలను కుదుర్చుకొనేందుకు ప్రయత్నించారు. కోర్టు తీర్పుపై వైట్‌హౌస్ ప్రతినిధి స్పందిస్తూ.. దేశంలో వాణిజ్యలోటు జాతీయ ఎమర్జెన్సీతో సమానమని అన్నారు. ఈ పరిస్థితి అమెరికన్ పౌరులను ధ్వంసం చేసిందని, తమ కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందని, రక్షణ రంగ పరిశ్రమలకు ఆధారమైన వ్యవస్థ బలహీనపడిందని, ఈ అంశాలన్నింటితో కోర్టు విభేదించలేదని చెప్పారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, అమెరికా ఔన్నత్యాన్ని పునరుద్ధరించడానికి పాలనా యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు.