న్యూఢిల్లీ : నోబెల్ శాంతి బహుమతిపై (Nobel Peace Prize) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఎనిమిది యుద్ధాలను ఆపానని, అవార్డు తనకే రావాలని, లేకపోతే అమెరికాకే అవమానమంటూ ట్రంప్ పదేపదే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవార్డు కోసం చివరి వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు ఫలితం దక్కలేదు. ట్రంప్‌ను కాకుండా వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయడంపై వైట్‌హౌస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మచాడోని ఎంపిక చేయడం ద్వారా నోబెల్ కమిటీ శాంతి కన్నా రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించింది. అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు చేయడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను కాపాడడం కొనసాగిస్తూనే ఉంటారు. ఆయనది మానవతావాద హృదయం. తన మనోబలంతో కొండలనైనా కదిల్చే శక్తిగల ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండరు అంటూ వైట్ హౌస్ అధికార ప్రతినిధి స్టేవెన్ చ్యూంగ్ కీర్తించారు.
నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడడానికి కొన్ని గంటల ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను తీవ్రంగా దుయ్యబట్టారు. ఏమీ చేయనందుకు, దేశాన్ని నాశనం చేసినందుకు ఒబామాకు గతంలో నోబెల్ శాంతి బహుమతి లభించిందని ఆయన విమర్శించారు. ఒబామాను చెత్త అధ్యక్షుడిగా ఆయన అభివర్ణించారు. గాజాలో శాంతి స్థాపన కోసం తాను మధ్యవర్తిత్వం వహించానని, దీంతో ఎనిమిది యుద్ధాలను ఆపిన ఘనత సాధించానని ట్రంప్ చెప్పారు. అవార్డులతో తాను ప్రేరణ పొందుతానని కాదని, కాని నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యేందుకు అన్ని అర్హతలు తనకు ఉన్నాయని ఆయన తెలిపారు.
నోబెల్ శాంతి బహుమతికి మరియాను ఎంపిక చేయడాన్ని నోబెల్ కమిటీ చైర్పర్సన్ జోర్గెన్ మాట్నే ఫ్రిడ్నెస్ సమర్థించుకున్నారు. ఎనిమిది యుద్ధాలను తానే ఆపినట్లు చెప్పకుంటున్న ట్రంప్‌ని తాము ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ఈ కమిటీ అన్ని రకాల ప్రచారాలను, మీడియా అత్యుత్సాహాన్ని చూసిందని ఆయన చెప్పారు. నోబెల్ బహుమతి గ్రహీతల ఫొటోలు ఉన్న గదిలో కమిటీ కూర్చుంటుంది. ఆ గదిలో ధైర్యం, సమగ్రత నిండి ఉంటాయి. చేసిన కృషి, ఆల్ఫ్రెడ్ నోబెల్ అభీష్టంపైనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది అని స్పష్టం చేశారు.