Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) కోసం తహతహలాడుతున్న విషయం తెలిసిందే. ఆయన మిత్ర పక్షం కూడా ట్రంప్‌కు నోబెల్ అందించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) ఈ ఏడాది నోబెల్ బహుమతులకు సంబంధించి.. వివిధ విభాగాలకు విజేతలను ప్రకటిస్తోంది. ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో నోబెల్ బహుమతి గెలుచుకోవడంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నోబెల్ బహుమతి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘నోబెల్ శాంతి బహుమతి వస్తుందో రాదో నాకు తెలియదు. మేమైతే ఏడు యుద్ధాలను ఆపాము. ఎనిమిదో యుద్ధం పరిష్కారానికి చాలా దగ్గరగా ఉన్నాము. రష్యా సమస్యను చివరికి పరిష్కరించుకుంటామని నేను అనుకుంటున్నా. చరిత్రలో ఎవరూ ఇన్ని యుద్ధాలను ఆపలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటికే పలు దేశాలు నన్ను నామినేట్ చేశాయి. కానీ, నోబెల్ కమిటీ మాత్రం.. నాకు శాంతి బహుమతి రాకుండగా ఒక కారణాన్ని కనుగొంటోంది’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
భారత్-పాక్ సహా ఏడు యుద్ధాల్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి 80వ సాధారణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ట్రంప్, ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పని.. తాను చేయాల్సి రావటం బాధాకరమంటూ ఐరాసపై విమర్శలు గుప్పించారు. ఏయే దేశాల మధ్య యుద్ధాల్ని ఆపింది.. ట్రంప్ వాటి జాబితా చదివి వినిపించారు. ‘కేవలం ఏడు నెలల్లో.. ఇతరులు అసాధ్యమని భావించే విధంగా ఏడు యుద్ధాల్ని ఆపాను. ఒకటి 31 ఏండ్లుగా, మరోటి 36 ఏండ్లుగా కొనసాగుతున్న సంక్షోభాలు’ అని అన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్థాన్, రువాండా- డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్-కంబోడియా, ఆర్మేనియా-అజర్బైజాన్, ఈజిప్టు-ఇథియోపియా, సెర్బియా-కొసావో దేశాల మధ్య యుద్ధాలను ఆపానని అన్నారు. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు చాలా దగ్గర్లోనే ఉన్నామంటూ చెప్పుకుంటున్నారు.
Also Read..
ఇల్లినాయిస్ను ఆక్రమించుకోనున్న టెక్సాస్.. అమెరికాలో మరో అంతర్యుద్ధం?