న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో కాల్పుల విరమణపై ఇప్పట్లో ఒప్పందం కుదిరే అవకాశం కనపడడం లేదు. ఇరాన్‌తో మధ్యవర్తులు చర్చిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా అటువంటిదేమీ లేదంటూ ఇరాన్ తేల్చేసింది. తాజాగా, గురువారం ట్రంప్ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీచేశారు. తాను అందజేసిన శాంతి ప్రతిపాదనలను తీవ్రంగా పట్టించుకోవాలని ట్రంప్ గురువారం హెచ్చరించారు. ఇరాన్‌ను నాసిరకం యోధులు, గొప్ప సంధానకర్తలుగా అభివర్ణిస్తూ చర్చల కోసం ఇరానే వేడుకుంటున్నదని ట్రంప్ చెప్పారు.
ఇరాన్‌తో యుద్ధంలోకి ప్రవేశించిన తర్వాత మొదటిసారి క్యాబినెట్ సమావేశంలో పాల్గొనడానికి ముందు విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ యుద్ధానికి దౌత్యపరమైన పరిష్కారం కోసం తపిస్తున్నది ఇరానే తప్ప అమెరికా కాదని చెప్పారు. టెహ్రాన్ నుంచే ఒత్తిడి వస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందం చేసుకునేది వాళ్లే(ఇరాన్) తప్ప నేనుకాదు అని ఆయన చెప్పారు. కాగా, ఇరానియన్ సంధానకర్తలు చాలా భిన్నంగా, విచిత్రంగా ఉన్నారు.
సైనికపరంగా పూర్తిగా నాశనమై మళ్లీ పుంజుకునే అవకాశం లేని కారణంగా వారు ఒక ఒప్పందం కోసం మమల్ని వేడుకోవాలి. అయినప్పటికీ వారు కేవలం మా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు. అది తప్పు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆలస్యం కాకముందే వాళ్లు త్వరగా మేల్కొనాలి. ఎందుకంటే ఒకసారి అలా జరిగితే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. దాని పర్యవసానం మాత్రం బాగుండదు అంటూ ఇరాన్‌ని ఆయన హెచ్చరించారు. అయితే అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
హోటళ్లలో దాక్కుంటున్న అమెరికా సైనికులు: ఇరాన్
మిలిటరీ స్థావరాల నుంచి అమెరికా సైనికులు పారిపోతున్నారని, గల్ఫ్ దేశాల్లోని హోటల్స్, కార్యాలయాల్లో దాక్కుంటున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. ‘యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా సైనికులు జీసీసీ (గల్ఫ్ దేశాల కూటమి) దేశాల్లో పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటున్నారు. వినియోగదారులకు ప్రమా దం కలుగుతుందని మిలిటరీ ఆఫీసర్లకు అమెరికా హోటళ్లు బుకింగ్‌లు నిరాకరిస్తున్నాయి. జీసీసీ హోటల్స్ కూడా అలాగే వ్యవహరించాలి’ అని అన్నారు.