Trade War | న్యూఢిల్లీ, మార్చి 13: యూరోపియన్ యూనియన్ (ఈయూ) వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ విధించిన 25 శాతం సుంకం ఫలితంగా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా, యూరోపియన్ యూనియన్ ప్రకటించాయి. దీనిపై ట్రంప్ మరోసారి స్పందించారు. అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించిన పక్షంలో తాము మళ్లీ అదనంగా జరిమానా విధిస్తామని ట్రంప్ బుధవారం ప్రకటించారు. వారు తమ నుంచి ఎంత వసూలు చేస్తారో తామూ అంతే వసూలు చేస్తామని స్పష్టంచేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా అధికారులతో తాము చర్చలను పునరుద్ధరిస్తామని యూరోపియన్ కమిషన్ చైర్మన్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ బుధవారం ప్రకటించారు. అటువంటి సుంకాలతో తమ ఆర్థిక వ్యవస్థలపై భారం వేయలేమని చైర్మన్ తెలిపారు.
అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంతో సహా తమ దేశం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను జీ7 విదేశాంగ సదస్సులో ప్రస్తావించడానికి కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ సంసిద్ధమవుతున్నారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన కెనడాకే అమెరికా ఈ విధంగా సుంకాలు విధించి శిక్షిస్తే ఇక ఎవరూ సురక్షితం కాదని ఆమె హెచ్చరించనున్నారు. కెనడా ఆతిథ్యమిస్తున్న జీ7 విదేశాంగ మంత్రుల సదస్సులో ఉక్రెయిన్, పశ్చిమాసియా, హైతీ, వెనిజులాపై ప్రధానంగా చర్చ జరగనున్నప్పటికీ అమెరికా సుంకాలు, సార్వభౌమత్వానికి ఎదురవుతున్న హెచ్చరికల గురించి సదస్సులో మిత్రదేశాలకు జోలీ వివరించనున్నారు. అమెరికా వాణిజ్య విధానాలను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని, కెనడాకు సహకారాన్ని ఆమె కోరనున్నారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 శాతం సుంకాన్ని విధించడం కెనడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా సుంకాలకు ప్రతీకారంగా కెనడా కూడా అమెరికా వస్తువులపై 2000 కోట్ల డాలర్ల విలువైన సుంకాలను విధించింది. అయితే కెనడాను అమెరికాలో విలీనం చేసుకోవడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఈ సుంకాల విధింపని కెనడా అనుమానిస్తోంది. అమెరికా ఒత్తిడికి కెనడా లొంగే ప్రసక్తే లేదని జోలీ స్పష్టం చేశారు.