వాషింగ్టన్ : ఇరాన్‌కు ఆయుధాలు అందిస్తే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. రాబోయే కొన్ని వారాల్లో ఇరాన్‌కు చైనా గగనతల రక్షణ వ్యవస్థలను అందజేయనున్నట్టు అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్తాసంస్థ పేర్కొన్నది. తమ మూలాలు బయటపడకుండా ఇతర దేశాల ద్వారా వాటిని ఇరాన్‌కు అందజేయనున్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ శనివారం శ్వేతసౌధం నుంచి మియామికి బయల్దేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌కు ఆయుధాలు అందిస్తే, చైనాకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించింది. తాము ఎవరికీ ఎలాంటి ఆయుధాలు అందించలేదని, నిరాధార ఆరోపణలను అమెరికా మానుకోవాలని యూఎస్‌లోని చైనా ఎంబసీ స్పష్టంచేసింది.