వాషింగ్టన్ : ఇరాన్‌తో చర్చలు విఫలం కావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక హెచ్చరిక చేశారు. హొర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. జలసంధి గుండా నౌకల రాకపోకలను యూఎస్ నేవీ తక్షణమే అడ్డుకుంటుందని తెలిపారు. జలసంధిని తెరుస్తామన్న హామీని నిలబెట్టుకోవడంలో ఇరాన్ విఫలమైందని చెప్పారు. ఇరాన్ చర్యల వల్ల అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించారు. సముద్ర మందుపాతరల కారణంగా హొర్ముజ్‌లో ఇప్పటికే నౌకా రవాణా మందగించిందని పేర్కొన్నారు. మందుపాతరలు ఉండొచ్చని వారు చెబుతున్నారని, అలాంటప్పుడు నౌకల యజమానులు ఎందుకు రిస్క్ తీసుకుంటారని ప్రశ్నించారు. మందుపాతరలను ఆసరాగా చేసుకొని జలసంధిని నియంత్రించేందుకు ఇరాన్ యత్నిస్తున్నదని ఆరోపించారు. ఇది దోపిడీ అని, దీనిని అమెరికా అనుమతించబోదని స్పష్టం చేశారు. ఇరాన్‌కు టోల్ చెల్లించే నౌకలను అమెరికా దళాలు అడ్డుకుంటాయని, ఈ చట్ట విరుద్ధ టోల్ చెల్లించే ఏ నౌక కూడా క్షేమంగా హొర్ముజ్‌ను దాటబోదని హెచ్చరించారు.
అమెరికా దళాలపైనా, వాణిజ్య నౌకలపైనా ఇరాన్ దాడులకు దిగితే తీవ్ర ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తమపై కానీ, శాంతియుత నౌకలపై కానీ దాడులు చేసే ఇరానియన్లను పేల్చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చల్లో చాలా అంశాల్లో ఒప్పందం కుదిరిందని, అయితే కీలకమైన ఇరాన్ అణు కార్యక్రమంపైనే ఏకాభిప్రాయం కుదరలేదని ట్రంప్ చెప్పారు. అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేదన్నారు. అయితే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం సాధించలేదని పునరుద్ఘాటించారు. ప్రపంచంలో 20 శాతం చమురు సరఫరా హొర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటి నుంచి హొర్ముజ్‌ను ఇరాన్ మూసివేసింది. హొర్ముజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) తీవ్రంగా స్పందించింది. జలసంధి తమ ఆధీనంలోనే ఉన్నదని పేర్కొన్నది. శత్రువులు ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా జలసంధిలోని ప్రమాదకర సుడిగుండాల్లో చిక్కుకు పోవడం ఖాయమని హెచ్చరించింది.