Donald Trump | ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ఈ బహుమతి కోసం ట్రంప్ తహతహలాడిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ ‘శాంతి’ ఆశలపై నీళ్లు చల్లుతూ 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వెనెజువెలా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడోకు (Maria Corina Machado) నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో శాంతి బహుమతి దక్కకపోవడంపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు మరియా కొరీనా మచాడోతో ఫోన్లో సంభాషించినట్లు తెలిపారు. ‘కొరీనా మచాడోతో ఫోన్లో మాట్లాడాను. నా గౌరవార్థం దాన్ని స్వీకరించినట్లు ఆమె నాతో చెప్పారు. అలా అని ఆ బహుమతి నాకు ఇచ్చేయమని నేను అడగలేదు. విపత్తు సమయంలో వెనెజువెలాలోని ప్రజలకు ఆమె చాలా సాయం చేశారు. నేను ఆమెకు తోడున్నా. ఇకముందు కూడా ఉంటా’ అని వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి మరియా కొరీనా మచాడోను (Maria Corina Machado) వరించిన విషయం తెలిసిందే. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసిన మచాడో వెనెజువెలా ఉక్కు మహిళగా కూడా పేరుపొందారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత పలుకుబడిగల 100 మంది ప్రముఖుల జాబితాలో కూడా ఆమె చోటు దక్కించుకున్నారు. గత ఏడాది జరిగిన వెనెజువెలా పార్లమెంట్ ఎన్నికలలో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగి ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్ మదురో గెలుపొందిన తర్వాత 58 ఏళ్ల మచాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఈ శాంతి బహుమతి దక్కడంపై మరియా కొరీనా స్పందిస్తూ.. ‘స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వెనెజువెలా ప్రజలందరికీ ఈ గుర్తింపు గొప్ప ప్రేరణ ఇస్తుంది. లక్ష్యసాధనలో విజయానికి చేరువలో ఉన్నాం. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు మాకు మిత్రులు. ఈ పురస్కారాన్ని కష్టాల్లో ఉన్న వెనెజువెలా ప్రజలతోపాటు మా పోరాటానికి నిర్మాణాత్మక మద్దతు ఇస్తున్న ట్రంప్‌నకు అంకితం ఇస్తున్నా’ అని అన్నారు.
Also Read..
ఉక్కు మహిళకు శాంతి కిరీటం.. వెనెజువెలా ప్రజాస్వామిక హక్కుల నేతకు నోబెల్
Trump Tariffs | చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. ప్రకటించిన ట్రంప్
H-1B Visa | హెచ్-1బీ అర్హత నిబంధనలు మరింత కఠినతరం.. డిసెంబర్ నుంచి అమల్లోకి!