న్యూఢిల్లీ, అక్టోబర్ 10: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆశలపై నీళ్లు చల్లుతూ 2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వెనెజువెలా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడోకు (Maria Corina Machado) నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసిన మచాడో వెనెజువెలా ఉక్కు మహిళగా కూడా పేరుపొందారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత పలుకుబడిగల 100 మంది ప్రముఖుల జాబితాలో కూడా ఆమె చోటు దక్కించుకున్నారు. గత ఏడాది జరిగిన వెనెజువెలా పార్లమెంట్ ఎన్నికలలో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగి ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్ మదురో గెలుపొందిన తర్వాత 58 ఏళ్ల మచాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే తాను ఎనిమిది యుద్ధాలను ఆపినందుకు తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాల్సి ఉంటుందని పదేపదే ప్రకటించుకున్న ట్రంప్‌కి తాజా పరిణామం తీవ్ర నిరాశను మిగిల్చే అవకాశం ఉన్నప్పటికీ మచాడో ఎంపికపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయకపోవచ్చు. ఇటీవల వెనెజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న ట్రంప్ ఆ దేశంతో అన్ని దౌత్యపరమైన సంబంధాలను నిలిపివేశారు. వెనెజువెలాలో అధికార మార్పిడిని ట్రంప్ కోరుతున్నట్లు కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. మదురోను బంధిస్తే 5 కోట్ల డాలర్ల బహుమతిని ప్రకటించినందుకు ట్రంప్‌కు గత ఆగస్టులో మచాడో ధన్యవాదాలు కూడా తెలియచేశారు.
శాంతి బహుమతి ప్రకటన చేస్తూ నోబెల్ కమిటీ మచాడోని వెనెజువెలా ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తిగా అభివర్ణించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య మార్పిడి కోసం శాంతియుతంగా పోరాడిన యోధురాలిగా ఆమెను పేర్కొంది. చీకటి ముసురుకుంటున్న సమయంలో ప్రజాస్వామ్య జ్యోతిని ఆరిపోకుండా వెలిగిస్తున్న ధైర్యవంతురాలైన శాంతికాముకురాలిగా మచాడోని నోబెల్ కమిటీ అభివర్ణించింది. వెనెజువెలాలో మదురో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక ఏళ్లుగా సాగుతున్న ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఆమె బెదిరింపులను ఎదుర్కోవడమే కాక అరెస్టు కూడా అయ్యారు. ప్రయాణ నిషేధాలను, రాజకీయ వేధింపులను ఎన్నో ఎదుర్కొన్నారు. ఇన్ని కష్టాలను తట్టుకుని కూడా ఆమె వెనెజువెలాలోనే ఉండి ఉక్కు మహిళగా గుర్తింపు పొందారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా నిషేధం విధించారు. తమదే నిజమైన విజయమని ప్రతిపక్షం ప్రకటించుకున్నప్పటికీ మదురో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మచాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైన మచాడో 2013లో సహవ్యవస్థాపకురాలిగా వెంటే వెనెజువెలా పేరిట ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దాని జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన 10 రోజుల తర్వాత అంటే జనవరి 31న నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ల గడువు ముగిసిపోయింది. తాను ఎనిమిది యుద్ధాలను ముగించినట్లు ఆయన చెప్పుకున్న ప్రకటనలేవీ నోబెల్ కమిటీ పరిశీలనలోకి వచ్చే అవకాశమే లేదు. ట్రంప్ పేరును ప్రతిపాదిస్తూ పాకిస్థాన్, ఇజ్రాయెల్ తదితర దేశాలు పంపిన లేఖలు కమిటీ పరిశీలనలోకి వచ్చే అవకాశం లేదు.
స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వెనెజువెలా ప్రజలందరికీ ఈ గుర్తింపు గొప్ప ప్రేరణ ఇస్తుంది. లక్ష్యసాధనలో విజయానికి చేరువలో ఉన్నాం. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు మాకు మిత్రులు. ఈ పురస్కారాన్ని కష్టాల్లో ఉన్న వెనెజువెలా ప్రజలతోపాటు మా పోరాటానికి నిర్మాణాత్మక మద్దతు ఇస్తున్న ట్రంప్‌నకు అంకితం ఇస్తున్నా.