న్యూయార్క్, అక్టోబర్ 10: విదేశీయులు హెచ్-1బీ వీసా (H-1B Visa) పొందేందుకు అర్హత నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్ యంత్రాంగం కొత్త నిబంధనలను రూపొందిస్తున్నది. ఇప్పటికే కొత్తగా జారీచేసే హెచ్-1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించడంతో మన దేశంలోని ఐటీ రంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. తాజాగా అర్హత నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం..
వీసా పరిమితి మినహాయింపుల అర్హతను మరింత కఠినతరం చేయడంతోపాటు వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై, థర్డ్ పార్టీ నియామకాలపై మరింత దృష్టి సారించనున్నారు. హెచ్-1బీ వీసాల్లో సమగ్రతను తేవడానికి, అమెరికన్ కార్మికులకు సరైన వేతనాలు, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించడానికి ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనలు వచ్చే డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.