Donald Trump : ఇరాన్, ఇజ్రాయెల్ (Iran, Israel) దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు ముగించాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. ఈ శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని ట్రంప్ చెప్పారు. ఇక్కడ తానే అన్ని నిర్ణయాలు తీసుకుంటానని, నెతన్యాహు (Nethanyahu) కాదని అన్నారు. భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరే ఒప్పందాన్ని ఆయన అంగీకరించి తీరాల్సిందేనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా ఇజ్రాయెల్ సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని ఆదివారం రాత్రి ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అంతకుముందు లెబనాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ దళాలు బీరుట్ శివార్లలో దాడులు చేశాయి. దీనికి ప్రతికారంగానే ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.
ఇరాన్‌పై ఎదురుదాడి చేయొద్దని నెతన్యాహును ట్రంప్ కోరనున్నట్లు సమాచారం.
ఇలాంటి సైనిక చర్యలవల్ల ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు దెబ్బతింటాయని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘మీరు క్షిపణులు ప్రయోగించారు. ఇక చాలు. ఇప్పుడైనా చర్చలకు వచ్చి ఒప్పందం చేసుకోండి’ అని పిలుపునిచ్చారు. అలాగే బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన ముందస్తు దాడులపై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకవేళ దౌత్యపరమైన చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. చర్చలు ఫలించకపోతే ఇరాన్‌పై కమాండో దాడులు చేసే ఆలోచన కూడా ఉందన్నారు.
తాము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని, ఒకవేళ ఇరాన్ వినకపోతే వారిపై బాంబులతో విరుచుకుపడతామని ఎన్బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలతోపాటు సైనిక ఒత్తిడిని కూడా కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.