Donald Trump : వెనెజువెలా (Venezuela) కు చెందిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లపై చర్యలు తీసుకోవడానికి అమెరికా సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. అతిత్వరలో వెనెజువెలా భూభాగంలో ఆపరేషన్లు చేపడతామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి సముద్రం మీదుగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోందని, వాటిని ఆపడానికి భూభాగంపై నుంచే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇప్పటికైనా తమ దేశంలోకి మాదక ద్రవ్యాలు సరఫరా చేయడాన్ని ఆపాలని వెనెజువెలాకు మరోసారి హెచ్చరిక చేశారు. అమెరికా ఇప్పటికే కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్జెట్లను మోహరించింది. అమెరికా దళాలు జరిపిన దాడుల్లో 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో ఏ క్షణమైనా అగ్రరాజ్యం వెనెజువెలా భూభాగంపై దాడిచేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వెనెజువెలాలో అమెరికా దళాలు చొరబడవచ్చని ప్రచారం జరుగుతోందని, వెనెజువెలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు. తాజాగా ఆ ముఠాలను అంతం చేసేందుకు సైనికదళాలను రంగంలోకి దింపారు. ఈ ముఠాలతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది.
మదురో సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని ట్రంప్ ఇటీవల స్వయంగా సోషల్ మీడియాలో హెచ్చరించారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదని శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ వెల్లడించారు. దాంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా ట్రంప్ కార్యవర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వెనెజువెలాలోని చమురు రిజర్వులను స్వాధీనం చేసుకోవడానికే అమెరికా ఈ చర్యలు చేపడుతోందని వార్తలు ప్రచారమవుతున్నాయి.