Donald Trump : ఇరాన్ (Iran) తో ఒక విస్తృత శాంతి ఒప్పందం (Peace deal) దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. శనివారం తన సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్ (Truth Social)’ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఒప్పందంపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాల అధినేతలతో ఫోన్లో చర్చలు జరిపినట్లు తెలిపారు.
అమెరికా, ఇరాన్‌తోపాటు పలు ఇతర దేశాల మధ్య ఈ ఒప్పందంపై చర్చలు చాలావరకు పూర్తయ్యాయని ట్రంప్ పేర్కొన్నారు. కేవలం తుది మెరుగులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా తాను ప్రత్యేకంగా మాట్లాడానని, ఆ చర్చలు కూడా సఫలమయ్యాయని ట్రంప్ చెప్పారు. ఒప్పందంలోని కీలక అంశాలను ప్రస్తావిస్తూ ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ పరిణామం భారత్‌కు ఎంతో ముఖ్యమైనదని, గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు అధికంగా చమురు దిగుమతులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థపై సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందం పూర్తి స్వరూపం, ఏ దేశం పాత్ర ఏంటి అనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. దీనిపై వైట్‌హౌస్ కూడా తక్షణమే ఎలాంటి అదనపు సమాచారం విడుదల చేయలేదు. తుది వివరాలపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒప్పందాన్ని ప్రకటిస్తామని ట్రంప్ తన పోస్ట్‌ను ముగించారు.