Donald Trump | అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు మరో 43 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), కమలా హారిస్ (Kamala Harris) తమ ప్రచార జోరు పెంచారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో తాను గెలవకపోతే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.
‘నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మేం ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదు. ఆ ఆలోచనే లేదు. మేం తప్పకుండా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఒకవేళ ఓడిపోతే.. 2028 ఎన్నికల్లో నేను బరిలోకి దిగను. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కాగా, ట్రంప్ ఇప్పటికే ఓసారి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఆయన రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత 2020 ఎన్నికల్లో జో బైడెన్‌పై మరోసారి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చవి చూశారు. ఇప్పుడు మరోసారి అధ్యక్ష బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇక నవంబర్ 5న అమెరికా 47వ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో కమలాదే పైచేయి అని అత్యధిక సర్వేలు అంచనా వేస్తున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలా హారిస్‌దే పైచేయి కొనసాగుతోందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read..
Dissanayake | శ్రీలంక అధ్యక్షుడిగా దిసనాయకే.. నేడు ప్రమాణ స్వీకారం
PM Modi | బీటెక్ విద్యార్థులకు 50 ఇండో పసిఫిక్ స్కాలర్షిప్లు