Israel Hezbollah War |నహరియా (ఇజ్రాయెల్), సెప్టెంబర్ 22: ఇజ్రాయెల్-లెబనాన్ పరస్పర తీవ్రంగా దాడులు చేసుకొంటున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై హెజ్బొల్లా ఆదివారం ఉదయం వంద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలో పౌర నివాసాలపై పడ్డాయి. ఈ దాడిలో నలుగురు గాయపడగా, పలు భవనాలు, నివాస ప్రాంతాలు దెబ్బ తిన్నాయని, పలు వాహనాలకు నిప్పు అంటుకున్నట్టు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ రాత్రే అప్రమత్తమైంది. ఉత్తర ఇజ్రాయెల్‌లో రాత్రి నుంచి సైరన్ల ద్వారా పౌరులను అప్రమత్తం చేసి, సురక్షిత, పునరావాస ప్రాంతాలకు తరలించింది. కాగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ శుక్రవారం యుద్ధ విమానాలతో జరిపిన విస్తృత దాడుల్లో బీరుట్లో ఒక హెజ్బొల్లా అగ్రనేత సహా 45 మంది పౌరులు మరణించారు. శనివారం లెబనాన్‌లో 400 మిలిటెంట్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో దాడి చేసినట్టు ఇజ్రాయెల్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ నాదడ్ షోషాని తెలిపారు. దీనికి ప్రతీకారంగా హెజ్బొల్లా ప్రతిదాడులకు పూనుకుంది.
యుద్ధంలో ఇప్పటికే హెజ్బొల్లాను తీవ్రంగా దెబ్బతీశామని, ఒక వేళ హెజ్బొల్లా తమ సందేశాన్ని కనుక అర్థం చేసుకోకపోతే ఇప్పుడు అర్థం చేసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు. రానున్న పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తమ దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్ మిలటరీ శనివారం 290 లక్ష్యాలను ఛేదించినట్టు ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని శాటిలైట్ న్యూస్ నెట్వర్క్ అల్ జజీరా కార్యాలయాలపై ఇజ్రాయెల్ సేనలు ఆదివారం దాడులకు దిగాయి. రామల్లాలోని దాని బ్యూరో కార్యాలయాన్ని మూసివేయించాయి. అక్కడ ఉన్న సామగ్రిని సీజ్ చేశాయి. వాటి ప్రసారాలను, వెబ్సైట్లను బ్లాక్ చేయించాయి. అయినప్పటికీ అల్ జజీరా వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ల నుంచి తమ వార్తా ప్రసారాలను కొనసాగించింది. విదేశీ గడ్డపై ఉన్న ఒక వార్తా సంస్థను ఇజ్రాయెల్ ఇలా మూసి వేయించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ ఈ విషయాన్ని అంగీకరించింది కూడా.