Donald Trump | వాషింగ్టన్ డీసీ: భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా వస్తువులపై ఆ దేశాలు ఎంత సుంకాన్ని విధిస్తాయో తాము కూడా అంతే సుంకాన్ని విధిస్తామని ఆయన వెల్లడించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలోనే తాము ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పారు. ఆ దేశాలు తమపై సుంకాలు విధిస్తే తాము కూడా సుంకాలు విధిస్తామని ఆయన అన్నారు.
భారత్ లేదా చైనా తమ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాయో తాము కూడా అ విధంగానే వారి పట్ల వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత వారం, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలకు ముందు భారతదేశ సుంకాల స్వరూపంపై ట్రంప్ వ్యాఖ్యానిస్తూ భారత్ అత్యధిక సుంకాలు విధిస్తోందని, అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రధాని మోదీతో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సమావేశం కావడాన్ని గురించి ప్రశ్నించగా భారత్తో వ్యాపారం చేయాలని మస్క్ భావిస్తున్నట్టు ఉందన్నారు. భారత్లో అత్యధికంగా సుంకాలు ఉన్నాయని, ఓ కంపెనీని నడుపుతున్న మస్క్ భారత్లో వ్యాపారం చేయడం గురించి మోదీతో సమావేశమై ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ గత వాణిజ్య విధానాలను ఆయన ప్రస్తావిస్తూ హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల ఉదంతాన్ని గుర్తు చేశారు.