న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయిదు రోజులుగా ఆ రెండు దేశాలు .. బాంబుల మోత మోగిస్తున్నాయి. అయితే ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కాల్పుల విమరణ కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన చేసినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్(Macron) తెలిపారు. కలుసుకుని, ఒప్పందం కుదుర్చుకోవాల్సిన సందర్భం వచ్చిందని, కాల్పుల విరమణ కోసం ఓ ఆఫర్ చేశారని, విస్తృత స్థాయిలో చర్చలు అవసరమని కెనడాలో జరుగుతున్న జీ7 సమావేశాల్లో మాక్రన్ మీడియాకు తెలిపారు. ట్రంప్ చేసిన ప్రతిపాదనపై ఆ రెండు దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలన్నారు.
ఇజ్రాయిల్, ఇరాన్ సంక్షోభం తీవ్రతను తగ్గిస్తూ కుదుర్చుకునే ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయబోరని అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. మరో వైపు కెనడాలోని అల్బెర్టాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి ట్రంప్ అర్థాంతరంగా వైదొలిగిపోయారు. హుటాహుటిన ఆయన వాషింగ్టన్కు వెళ్లారు. టెహ్రాన్ నుంచి తక్షణమే అందరూ ఖాళీ చేయాలని అమెరికా పౌరులకు ట్రంప్ హెచ్చరిక చేశారు. ఇరాన్ కూడా తమ అణ్వాయుధాల తయారీని తగ్గించుకోవాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అణు నిరాయుధీకరణపై ఇచ్చిన 60 రోజుల గడువు ముగిసింని, అందుకే ఇజ్రాయిల్ ఆ దేశంపై దాడి చేసినట్లు ఆయన చెప్పారు. అయినా ఇరాన్‌తో డీల్ చేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు కూడా ట్రంప్ తెలిపారు.
ఇరాన్లో ఉన్న అణ్వాయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. అయితే ఫోర్డోలో ఉన్న యురేనియం శుద్దీకరణ కేంద్రాన్ని మాత్రం ఇజ్రాయల్ ఏమీ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న కేంద్రం అండర్‌గ్రౌండ్‌లో చాలా లోతుగా ఉందని, ఆ కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే సుమారు 14వేల కిలోల బరువున్న బాంబులను వాడాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే అమెరికాకు చెందిన బీ2 స్టీల్త్ బాంబర్లను ఇజ్రాయిల్ వాడుకోవాలని చూస్తున్నది.