వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గట్టి షాక్ ఇచ్చారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి, డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఇటీవల మీడియా ఎదుటే వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రష్యాతో శాంతి చర్చలకు కీవ్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, శాంతి స్థాపనపై అధ్యక్షుడు ట్రంప్ దృష్టి సారించారని వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అమెరికా భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తాము సాయాన్ని నిలిపివేస్తున్నామని చెప్పారు. ఇది ఒక పరిష్కారాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇది తాత్కాలికమేనని తెలిపారు.
అయితే రష్యాతో యుద్ధంపై శాంతి, ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాల తవ్వకాలకు సంబంధించి ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గత శుక్రవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు నేతలు మీడియా, పలువురు దౌత్యవేత్తల సమక్షంలో రష్యా యుద్ధం గురించి గొడవవడ్డారు. మూడో ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నారని, అమర్యాదగా ఉన్నారంటూ జెలెన్స్కీని ట్రంప్ నిందించగా, దానికి జెలెన్స్కీ దీటుగా బదులిచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రస్తావిస్తూ హంతకుడితో రాజీ పడకూడదని అంటూ రష్యాపై ట్రంప్ వైఖరి ఏమిటని సూటిగా ప్రశ్నించారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం కొనసాగించకపోతే అమెరికా ‘భవిష్యత్తులో దాని ప్రభావాన్ని చవి చూస్తుంది’ అని జెలెన్స్కీ చేసిన హెచ్చరికపై ట్రంప్ ఆయనను ఆపి ‘మేమేమవుతామో మాకు చెప్పకండి. ఒక సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. సామరస్యంగా ప్రారంభమైన సమావేశం వీరి వాదనలు, వాగ్వాదాలతో వేడెక్కడంతో ట్రంప్ సమావేశాన్ని ఆకస్మాత్తుగా ముగించారు.
ఉక్రెయిన్ దురాక్రమణకు పుతిన్‌ను బాధ్యుడిని చేయాలంటూ జెలెన్స్కీ చర్చల సందర్భంగా పట్టుబట్టారు. అదే సమయంలో రష్యా రెండో దాడిని చేయదన్న తన నమ్మకాన్ని ట్రంప్ పునరుద్ఘాటించారు. దీంతో 10 నిముషాల పాటు సమావేశంలో వాతావరణం వేడెక్కింది. ‘నువ్వు చాలా చెడ్డ స్థితిలో ఉన్నావు, నీకు మరో అవకాశం లేదు’ అని ట్రంప్ అనగా, తాను కార్డులు ఆడటం లేదని జెలెన్స్కీ బదులిచ్చారు. ‘లేదు.. నువ్వు ఆటలు ఆడుతున్నావు. లక్షలాది మంది ప్రజల జీవితాలతో జూదం ఆడుతున్నావు. మూడో ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నావు. నువ్వు చేస్తున్నదంతా నీ దేశాన్ని అగౌరవపరుస్తుంది, చాలామంది చెప్పినట్టు మీకు మద్దతు ఇచ్చిన దాని కంటే ఎక్కువ’ అని ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్‌కు కనుక అమెరికా మిలిటరీ సామగ్రి అందజేయకపోతే యుద్ధం రెండు వారాల్లో ముగిసేదని అన్నారు.
యుద్ధం ముగింపు.. చాలా దూరం
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ముగించే ఒప్పందం చాలా చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారంరాత్రి ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తన సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. అమెరికాతో తమ సంబంధాలు కొనసాగుతాయని తాను భావిస్తున్నానని, అవి సందర్భోచిత సంబంధాలు కావని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి ఆర్థిక సాయం నిరంతరం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, యుద్ధం ముగింపు చాలా దూరమన్న జెలెన్స్కీ వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. ఇది వరస్ట్ స్టేట్మెంట్ అని దుయ్యబట్టారు. జెలెన్స్కీ శాంతిని కోరుకోవట్లేదని విమర్శించారు.