వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ అన్ని దేశాలపై సుంకాలు పెంచేసిన ట్రంప్.. దేశంలోని పలు వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకునేందుకు వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. తాజాగా 12 దేశాలకు చెందిన ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధిస్తున్నట్లు ప్రకటించారు.
అఫ్ఘానిస్థాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాలకు చెందిన ప్రయాణికులు అమెరికాకు రాకపోకలు సాగించడకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. మరో ఏడు దేశాలపై పాక్షికంగా నిషేధం విధించారు. ఈ జాబితాలో బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్థాన్, వెనెజులా ఉన్నాయి. జూన్ 9 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు వైట్‌హౌస్ వెల్లడించింది. ప్రమాదకరమైన విదేశీ వ్యక్తుల నుంచి అమెరికన్లను కాపాడతానంటూ మాట ఇచ్చిన అధ్యక్షుడు ట్రంప్ తన మాటను నిలబెట్టుకుంటున్నారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి అబిగైల్ జాక్సన్ అన్నారు. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోనే ఆయా దేశాలపై నిషేధం విధించినట్లు తెలిపారు.
ఇటీవల కొలరాడోలో యూదులపై సీసాబాంబులతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఫ్రీ పాలస్తీనా అంటూ యూదులపై ఓ వ్యక్తికి దాడిచేశాడు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ‘కొలరాడోలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటంతోనే.. మన మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరప్‌లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కానీ దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేం. అందుకే నేడు యెమెన్, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా’ అని ట్రంప్ ఓ వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.