వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లతో (Trump Tariffs) విరుచుకుపడుతూనే ఉన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మధ్యస్థ, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రొత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే.. అమెరికా-ఆధారిత భాగస్వామ్య దేశాలు, జాయింట్ వెంచర్లు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకపోలేదు. భారీ వాహనాల దిగుమతులపై టారీఫ్‌లు విధిస్తామని, వాటిని అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తామని ట్రంప్ గత నెలలో ప్రకటించారు.
ట్రంప్ టారీఫ్‌లతో చైనా, మెక్సికో, కెనడా, జర్మనీ, జపాన్, ఫిన్లాండ్ వంటి దేశాలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సుంకాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం జపాన్, ఈయూ నుంచి దిగుమతి చేసుకునే లైట్ డ్యూటీ వాహనాలపై 15 శాతం సుంకాలు అమలులో ఉన్నాయి. తాజాగా విధించిన టారీఫ్‌లతో అది పెరుగుతుందా లేదా తెలియాల్సి ఉన్నది. ఇక నూతన సుంకాల ప్రభావం భారత్‌పై అంతంతమాత్రంగానే ఉంటుందని వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. మన దేశం నుంచి అమెరికాకు ఈ తరహా ట్రక్కుల ఎగుమతులు చాలా తక్కువగా ఉంటాయని తెలిపాయి. అయితే.. ఇక్కడి కంపెనీలు అమెరికా మార్కెట్లో ప్రవేశించాలనుకుంటే మాత్రం టారిఫ్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి.