హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ సమీపంలో ప్రధాన రహదారికి ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన తన ట్రూత్ ఖాతాలో ఈ మేరకు పోస్ట్ట్ పెట్టారు. ‘భారతదేశంలోని హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసిన అవెన్యూకు నా పేరు పెట్టారు. ఈ విధంగా గౌరవం పొందిన తొలి అధ్యక్షుడిని నేనే.. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని పోస్టు చేశారు.
కాగా, అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ట్రంప్ తన పోస్టుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, యూఎస్ కాన్సులేట్ అధికారులు ఉన్న ఫొటోను జత చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారత్లో పర్యటిస్తారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం వెల్లడించారు. మోదీ, ట్రంప్ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని నొక్కి చెబుతూ భారత్-అమెరికా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ట్రంప్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేయడానికి ఈ ఏడాది చివరిలో తాను భారత్ పర్యటిస్తానని ఆయన తెలిపారు.