Donald Trump | వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను బహిష్కరించారు. అంతేకాదు, వలసలపై కఠిన నిర్ణయాలు అమల్లోకి తెచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, ప్రజా భద్రతను సాకుగా చూపుతూ మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించారు. ఏడు దేశాలపై నిషేధం, మరో 15 దేశాలపై ప్రవేశ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ మంగళవారం సంతకం చేశారు. తాజా నిర్ణయంతో అమెరికాలో ప్రవేశానికి నిషేధం ఉన్న దేశాల సంఖ్య 39కి పెరిగింది (US Travel Ban).
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఐదు దేశాల పౌరులపై అమెరికా పూర్తి స్థాయి నిషేధాన్ని విధించింది. ఇందులో బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియాలు ఉన్నాయి. వీటితో పాటు పాలస్తీనియన్ అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు ఉన్నవారు అమెరికాకు వలస రాకుండా పూర్తి నిషేధం విధించారు. గతంలో పాక్షిక ఆంక్షలు ఉన్న లావోస్, సియెర్రా లియోన్ దేశాలను కూడా ఇప్పుడు పూర్తి నిషేధిత జాబితాలోకి మార్చారు. పాక్షిక ఆంక్షలు విధించిన (partial entry restrictions) దేశాల జాబితాలో.. అంగోలా, ఆంటిగ్వా & బార్బుడా, బెనిన్, ఐవరీ కోస్ట్, డొమినికా, గాబన్, గాంబియా, మలావి, మౌరిటేనియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే ఉన్నాయి.
ఈ కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇక ఇప్పటికే అమెరికా ప్రభుత్వం 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. అప్ఘానిస్థాన్, బర్మా, చాడ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ దేశాలపై నిషేధం విధించింది. ఈ ఆంక్షల నుంచి ఇప్పటికే వీసాలు ఉన్నవారు, అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్లు, దౌత్యవేత్తలు, క్రీడాకారులు, అమెరికా ప్రయోజనాలకు అవసరమని భావించే వ్యక్తులకు మినహాయింపు ఉంటుంది.
Also Read..
గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలో భారత సంతతి మహిళ నిర్బంధం
దేశం వెలుపల జన్మించినా పౌరసత్వం!.. కెనడా పౌరసత్వ నిబంధనల్లో మార్పు
రూ 90 వేల కోట్లకు బీబీసీపై ట్రంప్ దావా