వాషింగ్టన్: తన ప్రసంగాన్ని ఎడిటింగ్ చేసి మోసపూరిత, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను పాటించినందుకు బీబీసీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. బీబీసీ కథనం వల్ల తనకు జరిగిన నష్టానికి గాను ఆ సంస్థ సుమారు రూ.90 వేల కోట్లు (10 బిలియన్ల డాలర్లు) చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకొని ప్రభావితం చేయడానికి బీబీసీ చేసిన సిగ్గు చేటు ప్రయత్నంగా బీబీసీ వీడియోను ట్రంప్ అభివర్ణించారు. తనను అవమానించేలా, రెచ్చగొట్టేలా, దురుద్దేశంతో బీబీసీ ఈ కథనాన్ని ప్రసారం చేసిందని ఆయన ఆరోపించారు. జనవరి 6, 2021న తాను చేసిన ప్రసంగ అర్థాన్ని ఉద్దేశపూర్వకంగా వక్రీకరించడానికి బీబీసీ ప్రయత్నించిందని ఆయన దావాలో పేర్కొన్నారు.