వాషింగ్టన్, డిసెంబర్ 16: గత 30 ఏండ్లుగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఒక మహిళను గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ సందర్భంగా అక్రమంగా నివసిస్తున్నావని ఆరోపిస్తూ నిర్బంధంలోకి తీసుకున్న ఘటన దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ నగరంలో చోటుచేసుకుంది. ‘లాంగ్ బీచ్ వాచ్డాగ్’ కథనం ప్రకారం బబ్లేజిత్ బబ్లీ కౌర్ (60) కూతురు, అల్లుడుతో ఉంటూ 1994 నుంచి అమెరికాలో నివసిస్తున్నారు. ఈ నెల 1న గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం అధికారులు పిలిచారు.
బయోమెట్రిక్ స్కాన్ సందర్భంగా ఆమె అక్రమంగా నివసిస్తున్నట్టు ఆరోపించిన ఐసీఈ ఏజెంట్లు ఆమెను నిర్బంధ కేంద్రానికి తరలించారు. తన తల్లిని ఎందుకు నిర్బంధించారో కూడా హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తమకు తెలియజేయలేదని 35 ఏండ్ల ఆమె కుమార్తె జోటి ఆరోపించారు. అధికారులను పదేపదే ప్రశ్నించగా, ఆమెను లాస్ఏంజెలెస్లోని ఒక నిర్బంధ కేంద్రానికి తరలించినట్టు చెప్పారన్నారు. తన తల్లి గ్రీన్ కార్డు పిటిషన్ ఇప్పటికే ఆమోదం పొందిందని ఆమె చెప్పారు. 1994లో అమెరికా వెళ్లిన బబ్లీ కౌర్ రెండు దశాబ్దాలకు పైగా లగూనా బీచ్లో స్థిరపడ్డారు.