Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ (Iran) పై యుద్ధాన్ని మరోసారి సమర్థించుకున్నారు. బీ2 బాంబర్ల (B2 Bombers) తో ఇరాన్‌పై దాడి చేసి.. ఆ దేశం అణ్వాయుధాలను తయారుచేయకుండా అడ్డుకున్నామన్నామని చెప్పారు. ఒకవేళ తాను అలా చేయకపోయి ఉంటే పశ్చిమాసియా (West Asia) , ఐరోపా (Europe) దేశాలు ముక్కలైపోయేవని అన్నారు. ఫ్లోరిడా (Florida) లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ అనే అందమైన దేశంలోకి వెళ్లి వారి వద్ద అణ్వాయుధాలు లేదని మనం నిర్ధారించుకోవాలని ట్రంప్ చెప్పారు. బీ2 బాంబర్లతో వారిని అడ్డుకున్నామని, ఒకవేళ తాము అలా చేయకపోయిఉంటే.. వారి వద్ద అణ్వాయుధం ఉండేదని, ఇజ్రాయెల్, పశ్చిమాసియాతో సహా ఐరోపా దేశాలు ముక్కలు ముక్కలుగా పేలిపోయి ఉండేవని అన్నారు. ఇరాన్ నాయకత్వం బలహీనపడిందని, ఆ దేశ సైనిక సామర్థ్యం గణనీయంగా క్షీణించిందని తెలిపారు. తమ సైనిక చర్యతో ఇరాన్ నాశనమైందని, వారి వైమానిక, నౌకాదళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని చెప్పారు.
శాంతిచర్చలు తాను ఆశించినవిధంగా జరగకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభంపై మాట్లాడారు. పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని, యుద్ధం ముగిసిన వెంటనే పెట్రోల్ ధరలు తగ్గుతాయని అన్నారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలనుకుంటుందని కానీ, వారి ప్రతిపాదన సంతృప్తిగా లేదని చెప్పారు. ఇరాన్లో నాయకత్వం విచ్ఛిన్నం అయ్యిందని, అక్కడ నాలుగైదు గ్రూపులు ఉన్నాయని, ఒప్పందం విషయంలో వారి మధ్య గందరగోళం నెలకొన్నదని చెప్పారు.