వాషింగ్టన్: అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. మంచివారైన, చాలా కాలం నుంచి తమ వద్ద పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ దూకుడు విధానం తమ నుంచి దూరం చేస్తున్నదని రైతులు, హోటల్, లీజర్ బిజినెస్ వర్గాలు చెప్పినట్లు ఈ నెల 12న ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఆయన తెలిపారు.
ఈ ఉద్యోగాల్లో వేరొకరిని నియమించడం దాదాపు అసాధ్యమని అంటున్నారని చెప్పారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అమలు చేసిన అత్యంత అవివేకమైన ఓపెన్ బోర్డర్ పాలసీ వల్ల దేశంలోకి నేరగాళ్లు రావడానికి అవకాశం కలిగిందన్నారు. ఈ విధానంలో మార్పులు రాబోతున్నాయ ని చెప్పారు. లాస్ ఏంజెలెస్‌లో నిరసనలపై ట్రంప్ స్పందిస్తూ, వలసదారులు ఎక్కువగా పని చేస్తున్న ఈ ప్రాంతంలో వ్యాపారాలకు ఆటంకం కలగకుండా కార్యనిర్వాహక ఆదేశాన్ని జారీ చేస్తానని చెప్పారు.