న్యూఢిల్లీ, మార్చి 9 : అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వివరణ ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకోడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే సుంకాలు తగ్గించినట్టు అధికారులు స్పష్టం చేశారు. తమ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలకు ప్రతీకారంగా తాము సైతం పన్నులు వేస్తామని, ఏప్రిల్ 2 నుంచి వాటిని అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన క్రమంలోనే అమెరికాకు భయపడి భారత్ ఈ సుంకాలను తగ్గించిందన్న వార్తలను అధికారులు తిరస్కరించారు.
గతంలో కూడా ఆస్ట్రేలియా, యూఏఈ, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల సమయంలో కూడా ఈ సుంకాలు తగ్గించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. . ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య టారిఫ్‌ల తగ్గింపు విషయమై జరుగుతున్న చర్చలు ఈ దృష్టితోనే చూడాలి తప్ప ట్రంప్ డెడ్‌లైన్ వల్ల కాదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. వార్తా సంస్థల కథనం ప్రకారం.. ఒక్క వ్యవసాయ ఉత్పత్తులు మినహా తాము ఎగుమతి చేస్తున్న అన్ని వస్తువులపై సుంకాలు తొలగించాలని భారత్‌ను అమెరికా కోరింది. ఈ డిమాండ్‌ను భారత్ అంగీకరించినట్టయితే ఎలాంటి ప్రతిఫలం లేకుండానే తన వాణి జ్య రక్షణలను వదులుకోవాల్సి వస్తుంది.