వాషింగ్టన్, జూలై 8 : ట్రంప్ సర్కార్ వలస నిబంధనలను మరింత కఠితనం చేస్తున్నది. దీంతో హెచ్1బీ వీసా లభించడం మరింత దుర్లభం కానున్నది. విదేశాల నుంచి ఉద్యోగులను నియమించుకొనే సంస్థలపై మరింత ఆర్థిక భారం మోపడం, అంతర్జాతీయ విద్యార్థులకు వీసా నిబంధనలను మార్చడం, ఆటోమేటిక్ వీసా పొడిగింపులను రద్దు చేయడం వంటి వాటిని వలస నిబంధనల్లో చేర్చాలని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో భారత్ నిపుణులు, విద్యార్థులు, హెచ్-4 వీసా ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. అమెరికా హోంశాఖ, కార్మిక శాఖ, విదేశాంగ శాఖలు తమ ఎజెండాలో వీటిని చేర్చినట్టు తెలుస్తున్నది.
ఈ చర్యల్లో కొన్నింటిని తుది నిబంధనలుగా జారీ చేయనుండగా, మరికొన్నింటిని అమలు చేయడానికి ముందు వాటిపై ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. ఈ నెలలో అమలులోకి రానున్న మొదటి నిబంధనలో విదేశీ ఉద్యోగులను చేర్చుకొనే సంస్థలపై ఫీజును మరింత పెంచనున్నారు. ప్రస్తుతం 50మంది కన్నా ఎక్కువ మంది ఉద్యోగులన్న సంస్థల్లో సగానికిపైగా హెచ్1బీ లేదా ఎల్1 వీసాదారులు ఉంటే అదనంగా 4,000 డాలర్లను చెల్లించాలి. హెచ్1బీ వీసా పొందేందుకు అవసరమైన కనీస వేతన స్థాయిని మరింత పెంచే ప్రతిపాదనపై కార్మిక శాఖ కసరత్తు చేస్తున్నట్టు ఆ వార్తా కథనం వెల్లడించింది.