Justin Trudeau | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మరో రెండు రోజుల్లో తన పదవి నుంచి దిగిపోనున్నారు. మార్చి 9వ తేదీన ఆయన స్థానంలో లిబరల్ పార్టీ (Liberal Party) కొత్త నేతను ఎన్నుకోబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధానిగా చివరిసారి కెనడా ప్రజలను ఉద్దేశించి ట్రూడో గురువారం మాట్లాడారు. విలేకరుల సమావేశంలో భావోద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు.
తన పదేళ్ల పాలనలో ఎదురైన సవాళ్లను తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కెనడా ప్రధానిగా నిరంతరం దేశ ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసినట్లు చెప్పారు. ‘కెనడా ప్రజల ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా పనిచేశా. ప్రజల మద్దతుతో చివరి వరకూ మెరుగైన పాలన అందించా. ప్రజల మద్దతు నాకు ఉంది. నా చివరి రోజుల్లో కూడా వారిని వదిలేయలేదు. ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులోనూ ప్రజల కోసం నిలబడతాను’ అంటూ ట్రూడో మీడియా ముందు భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక కెనడా, మెక్సికోకు అదనపు టారిఫ్ల (Trumps tariff war) నుంచి నెల రోజులపాటు ట్రంప్ ఇచ్చిన ఉపశమనం గురించి ట్రూడో నిరాశతో స్పందించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభాలు, ట్రంప్ ప్రభుత్వాన్ని కష్టకాలంగా అభివర్ణించారు. ట్రంప్ విధించిన టారిఫ్లకు ప్రతిగా కెనడా కూడా ఆంక్షలు, ఇతర వ్యూహాలను అమలు చేస్తుందని తెలిపారు.
కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో జనవరి 6న ప్రకటించిన విషయం తెలిసిందే. ఒట్టావాలోని తన నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను రాజీనామా చేస్తానని తన పార్టీకి, గవర్నర్కు తెలియజేసినట్టు తెలిపారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల వరకు పార్టీని, కెనడాకు నాయకత్వం వహించే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా జనవరి 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తన నాయకత్వంపై లిబరల్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అసంతృప్తి పెరిగిపోతుండటంతో అర్ధంతరంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Woman Passenger | షాకింగ్.. దుస్తులు తీసేసి విమానంలో పరుగులు తీసిన మహిళా ప్రయాణికురాలు
బందీలందరినీ విడిచిపెట్టండి.. లేకుంటే అంతుచూస్తా