వాషింగ్టన్, మార్చి 6: గాజాలో బందీలుగా ఉంచిన మిగిలిన బందీలందరినీ విడిచి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌ను ఆఖరిసారి హెచ్చరించారు. హమాస్‌తో చర్చలు జరిపేందుకు తానొక ప్రతినిధి బృందాన్ని పంపానని బుధవారం ఆయన ‘ట్రూత్’లో పోస్ట్ పెట్టారు. కొంతకాలం క్రితం హమాస్ చెర నుంచి విడుదలైన ఎనిమిది మంది బందీలను వైట్‌హౌస్‌లో కలుసుకున్న అనంతరం ఆయన ఈ పోస్ట్ చేశారు. ‘ఇప్పుడే బందీలందరినీ విడిచి పెట్టండి. మీరు హత్య చేసిన బందీల శవాలను అప్పగించండి. లేకుంటే మీరు అంతమైపోతారు’ అని ఆయన హమాస్‌ను తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.
బందీలందరినీ విడుదల చేయాలని ట్రంప్ చేసిన హెచ్చరికలు కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ఇజ్రాయెల్ వెనక్కు మళ్లేందుకు ఉపయోగపడేలా ఉన్నాయని హమాస్ విమర్శించింది. ‘మిగిలిన ఇజ్రాయెల్ ఖైదీలను విడుదల చేయడానికి ఉత్తమ మార్గం.. మధ్యవర్తుల సమక్షంలో సంతకం చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉండి, దాంట్లోని రెండో దశ అమలు చేయడం’ అని హమాస్ అధికార ప్రతినిధి గురువారం రాయిటర్స్ సంస్థకు సమాచారం అందించారు.