సిటీబ్యూరో, మార్చి 11(నమస్తే తెలంగాణ): యువత కేవలం ఓటర్లుగానే కాకుండా, దేశ గమనాన్ని మార్చే నాయకులుగా ఎదగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో నిర్వహించిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినులు నిర్వహించిన పార్లమెంటరీ చర్చను ఆసక్తిగా విన్నారు. వారిలోని నాయకత్వ పటిమను అభినందిస్తూ… దేశ భవిష్యత్‌ను మార్చే శక్తి యువతకు మాత్రమే ఉందని, ఇందులో యువతులు ముఖ్య భూమికను పోషించాలని, నవభారత్ నిర్మాణానికి మహిళలే నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు యువత పరిష్కారం చూపే శక్తిగా ఎదగాలని సూచించారు. నేటితరం రాజకీయాల పట్ల విముఖత చూపడం సరికాదని, వ్యవస్థలో మార్పు రావాలంటే విద్యావంతులైన యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై యువత స్పందించాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. నేటితరానికి రాజకీయాలు ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఈ రాజకీయాలే ఈ తరం జీవితాలను శాసిస్తాయనే విషయాన్ని యువతీయువకులందరూ గ్రహించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ విధానం అత్యంత కీలకమని, విద్యార్థి దశ నుంచే చట్టసభల పనితీరుపై అవగాహన పెంచుకోవాలన్నారు. నైపుణ్యాలను పెంపొందించుకుని, అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని, ఇన్నోవేషన్ రంగాల్లో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
అన్నగా చెబుతున్నా… ఆర్థిక స్వేచ్ఛ కీలకం
నేటితరం యువతులకు ఒక అన్నగా చెబుతున్నా… ఆర్థిక స్వావలంబన దిశగా ప్రతి ఒక్క యువతీ కృషి చేయాలన్నారు. అందుకు విద్యార్థి దశ నుంచి బలమైన పునాదిని వేసుకోవాలని, మారుతున్న టెక్నాలజీ, మార్కెట్ అవసరాలు, ఏర్పడుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకుని ఆర్థికంగా ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. ఆర్థికంగా నిలబడినప్పుడే ఆత్మగౌరవంతో, సొంత నిర్ణయాలు తీసుకోగలమన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా పాలనలో భాగస్వామ్యం అయ్యే ఆలోచన పెంపొందించుకోవాలని సూచించారు.
అసాధ్యమనేది లేదు..
స్వరాష్ట్ర సాధన తర్వాత ఏర్పాటైన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని అభ్యున్నతి దిశగా నడిపించింది. ఈ క్రమంలోనే అన్ని వర్గాలను ముఖ్యంగా మహిళలు, యువతను ఆర్థికంగా ఎదిగే అవకాశాలను కల్పించింది. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఇందులోభాగంగానే టీ హబ్, వీ-హబ్ వంటి వేదికలను ఏర్పాటు చేసిందన్నారు. అసాధ్యమనే ప్రశ్నకు తావు లేకుండా యువతులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
ఆకట్టుకున్న యూత్ పార్లమెంట్…
యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌కు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. ఎన్సీసీ కేడెట్లు ఆధ్వర్యంలో గార్డ్ ఆఫ్ ఆన్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కాలేజీలో ఏర్పాటు చేసిన యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.