Viral news : సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఘటన వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ‘పెళ్లి వార్త వైరల్ కావడమేంటి.. అందరూ పెళ్లిళ్లు చేసుకుంటారుగా..!’ అని ఆశ్చర్యపోతున్నారా..? అందరూ పెళ్లిళ్లు చేసుకుంటారు నిజమే. కానీ ఈ పెళ్లి మాత్రం చాలా డిఫరెంట్. ఇక్కడ పెళ్లి కొడుకు వయసు 23 ఏళ్లు. పెళ్లి కూతురు వయసు మాత్రం 91 ఏళ్లు. ఇద్దరి నడుమ సుమారుగా 68 ఏళ్ల గ్యాప్. అంతేకాదు, హనీమూన్ ట్రిప్‌లో పెళ్లి కుమార్తె చచ్చిపోయింది. అందుకే ఈ వార్త వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనాలో ఓ 23 ఏళ్ల యువకుడు తన తల్లి, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఓ 91 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు కూడా వారితోపాటే ఉంటోంది. అంతకుముందే యువకుడి తండ్రి చనిపోయి ఉండటంతో వారి కుటుంబం కడు పేదరికంలో ఉంది. దాంతో ఆ యువకుడు చదువు ఖర్చులకు కూడా డబ్బులు లేక తెగ ఇబ్బంది పడేవాడు. ఆ క్రమంలో ఒంటరి వృద్ధురాలు అతడికి ఒక ఆఫర్ చేసింది. తనను పెళ్లి చేసుకుంటే యువకుడి చదువుతోపాటు, ఇంటి ఖర్చులు తానే చూసుకుంటానని చెప్పింది.
తనను పెళ్లి చేసుకుంటే తన సంపదతోపాటు, తన తదనంతరం ఒక భర్తగా తన పెన్షన్ కూడా అతడికే వస్తుందని తెలిపింది. వృద్ధురాలి ఆఫర్‌కు యువకుడితోపాటు అతడి తల్లి, సోదరుడు కూడా అంగీకారం తెలుపడంతో వారికి వివాహం జరిపించారు. వివాహం తర్వాత కొత్త జంట హనీమూన్‌కు వెళ్లారు. ఈ హనీమూన్ సమయంలోనే పెళ్లి కూతురు బెడ్‌పైనే ప్రాణాలు కోల్పోయింది. దాంతో యువకుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.
ఆ తర్వాత భార్య పెన్షన్ కోసం ఆ యువకుడు దరఖాస్తు చేశాడు. విచారణకు వచ్చిన అధికారులు యువకుడే తన భార్యను హత్యచేసి ఉంటాడని అనుమానించారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ యువకుడు న్యాయ పోరాటం చేసి తాను హంతకుడిని కాదని నిరూపించాడు. ఆమెది సహజ మరణమేనని రుజువు చేశాడు. దాంతో జైలుకు వెళ్లే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అయితే మృతురాలి పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం అధికారులు నిరాకరించారు.