వాషింగ్టన్: ఏఐ ఏజెంట్లు మరింత సామర్థ్యాన్ని పొంది క్లిష్టమైన లక్ష్యాలను స్వీకరిస్తున్నందున కంపెనీలు ఇకపై వాటిని ఉద్యోగుల్లాగా భావించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు. ‘పాసిబుల్ పాడ్కాస్ట్’లో ఆయన మాట్లాడుతూ ఏఐ ఏజెంట్లకు అవి వేటిని యాక్సెస్ చేయవచ్చు, చేయకూడదో అనే దానిపై గుర్తింపు, అనుమతులు, స్పష్టమైన మార్గ దర్శకాలు అవసరమన్నారు. మానవ ఉద్యోగులకు చేసినట్టుగానే వాటి చర్యలను కూడా కంపెనీలు ఆడిట్ చేయవచ్చన్నారు. ఏఐ అసిస్టెంట్లు తమ యూజర్ల తరపున టికెట్ల బుకింగ్, ఫారాలు పూరించడం, రిజర్వేషన్లు చేయడం లాంటి పనులు చేస్తున్న వేళ సత్య నాదెళ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఏఐ ఏజెంట్ల బాధ్యతలు పెరగడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా వస్తున్నాయి. డాటాబేస్లను తొలగించడం, సూచనలను తప్పుగా అర్థం చేసుకోవడం, సంస్థలో తీవ్ర పరిణామాలు తలెత్తేలా చర్యలు తీసుకోవడం లాంటి ఘటనలు ఇప్పటికే జరిగాయి. అందుకే కంపెనీలు ఏఐ ఏజెంట్లను ఎక్కువగా వినినియోగిస్తున్నందున వాటి పర్యవేక్షణ, పాలన అత్యంత కీలకమవుతుందని నాదెళ్ల తెలిపారు.