US death penalty | అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ట్రాన్స్‌జెండర్ మహిళకు మరణశిక్ష విధించారు. మంగళవారం రాత్రి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి ఆమెకు శిక్షను అమలుచేసినట్లు జైలు అధికారులు తెలిపారు. మరణశిక్షకు గురైన ట్రాన్స్‌జెండర్ ఇటీవలి వరకు మిస్సోరి జైలులో ఉన్నారు. మిస్సోరి రిపబ్లికన్ గవర్నర్ మైక్ పార్సన్ ఆమె క్షమాపణ అభ్యర్థనను తిరస్కరించడంతో ఆమెకు మరణశిక్షను అమలుచేశారు.
అంబర్ మెక్లాఫ్లిన్ అనే 49 ఏండ్ల వ్యక్తి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ బెవర్లీ గున్థర్ను హతమార్చాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సెయింట్ లూయిస్‌లోని మిసిసిపి నది సమీపంలో పడేశాడు. ఈ కేసులో మెక్లాఫ్లిన్ను స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. దాంతో ఆమెను 2003 లో మిస్సోరీ జైలుకు తరలించారు. కాగా, ఈ హత్య కేసును విచారించిన కోర్టు 2016 లో ఆమెకు మరణశిక్ష విధించింది. 2021 లో ఈ తీర్పును ఫెడరల్ కోర్టు సమర్ధించింది. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని మిస్సోరి గవర్నర్ మైక్ పార్సన్‌కు అభ్యర్థన పెట్టుకోగా.. గవర్నర్ ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. దాంతో ఆమెకు మంగళవారం రాత్రి 7 గంటలకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్షను అమలుచేశారు. తాను చేసిన పనికి క్షమించమని చివరి మాటగా మెక్లాఫ్లిన్ కోరిందని జైలు అధికారులు చెప్పారు.
కాగా, 1970 మధ్యకాలంలో మరణశిక్షను పునరుద్ధరించినప్పటి నుంచి ఇప్పటివరకు 1,558 మందికి మరణశిక్ష విధించినట్లు యాంటీ-ఎగ్జిక్యూషన్ డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్ వెబ్సైట్ డాటా వెల్లడిస్తున్నది. మరణశిక్ష విధించబడిన వారిలో 17 మంది మినహా అందరూ పురుషులే. బహిరంగంగా లింగమార్పిడి చేయించుకున్న ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసిన సందర్భాలు ఇంతకు ముందు లేవు. ఇలాఉండగా, గర్లఫ్రెండ్‌తో రిలేషన్షిప్ తొలిగిపోయిన తర్వాత మెక్లాఫ్లిన్ లింగమార్పిడి చేయించుకుని మహిళగా మారినట్లు అధికారులు చెప్తున్నారు.