Trade war : అమెరికా – చైనా (USA – China) మధ్య వాణిజ్య యుద్ధం (Trade war) మరింత తీవ్రమైంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను ఎగుమతి చేయడాన్ని డ్రాగన్ కంట్రీ (Dragon country) నిలిపివేసింది. దాంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ తయారీ కంపెనీలు, సెమీకండక్టర్స్ కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నాయి.
ఎగుమతులకు సంబంధించిన నూతన నిబంధనలను చైనా రూపొందిస్తోంది. అప్పటివరకు చైనా పోర్టుల నుంచి మాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా మాగ్నెట్ల సరఫరా నిలిచిపోనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతి స్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది.
ఇప్పటికే చైనా ఉత్పత్తులపై ట్రంప్ 54 శాతం టారిఫ్‌లను విధించారు. వీటిని కాకుండా పర్మినెంట్ మాగ్నెట్లు, ఇతర ఉత్పత్తులను కూడా నిలిపేశారు. ఈ లోటును భర్తీ చేసుకోవడం అగ్రరాజ్యానికి ఇబ్బందికరంగా మారనుంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నది. చైనా తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అమెరికా వరకే పరిమితం కాదు. అన్ని దేశాలపై ఉండనుంది.
కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్‌లో తనకున్న శక్తిని చైనా ఆయుధంగా వాడుతోంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్ లైసెన్స్‌లను పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాక్‌హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ లాంటి సంస్థలు చాలా ముడిపదార్థాల కోసం బీజింగ్‌పైనే ఆధారపడుతున్నాయి. అమెరికా ప్రభుత్వం వద్ద రేర్ఎర్త్ మినరల్స్ నిల్వలు ఇప్పటికే ఉన్నాయి.