న్యూయార్క్ : ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో పర్వతారోహణ చేస్తుండగా తెలుగు టెకీ విష్ణు ఇరిగిరెడ్డి (48) ప్రమాదవశాత్తూ మరణించారు. విష్ణు, మరో ముగ్గురు గ్రానైట్ శిలలతో కూడిన కొండ వంటి ప్రదేశంపైకి ఎక్కుతుండగా తుఫాన్ వచ్చింది. దీంతో వీరంతా తిరిగి కిందికి దిగేందుకు ప్రయత్నించారు. అయితే, యాంకర్ పాయింట్ ఫెయిల్ అవడంతో 200 అడుగుల కిందికి పడిపోయారు.
వీరిలో ఒకరు అదృష్టవశాత్తూ తప్పించుకోగా, మిగిలిన ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. విష్ణుకు పర్వతారోహణ పట్ల మక్కువ ఎక్కువ అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సియాటెల్‌లోని టెక్, కల్చరల్ కమ్యూనిటీలో మంచి సభ్యుడని పేర్కొన్నారు. ఆయన గ్రేటర్ సియాటెల్ ఏరియాలోని టెస్ట్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్లూక్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా పని చేస్తున్నారు. ఆయన అసాధారణ నాయకత్వ లక్షణాలు కలవారని ఆ కంపెనీ పేర్కొంది.