అమెరికాలో రెండు చిన్న విమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంల ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అమెరికాలోని డెన్వర్ సమీపంలో ఈ ఘోరప్రమాదం జరిగింది. నలుగురు కూర్చునే వీలుండే సెస్నా 172 విమానం గాల్లో ఉండగా.. మరో చిన్న విమానం సోనెక్స్ జీనోస్ దాన్ని ఢీకొట్టింది. జీనోస్ విమానాన్ని సొంతంగా ఇంటి వద్దనే చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఇద్దరు కూర్చునే వీలుంది.
ఉదయం ఆకాశంలో ఎగురుతున్న ఈ రెండు విమానాలు అకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఈ సమయంలో సంభవించిన పేలుడు శబ్దానికి వచ్చి చూసిన ప్రజలకు.. ఆకాశం నిర్మలంగా ఉండగా ఆ విమానాలు ఎలా ఢీకొన్నాయో అర్థం కాలేదు. సమీపంలోనే కూలిపోయిన ఈ విమానాలను అధికారులు పరిశీలించగా.. ఒక విమానం శిధిలాల్లో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభించాయి. మరో విమానంలో ఉన్న పైలట్ తీవ్రంగా గాయపడి ఉండటంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మరణించినట్లు సమాచారం. ప్రమాదానికి కారణం ఏంటో కనుక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.