చెన్నై: నలుపు రంగు షార్ట్ డ్రెస్సు వేసుకుని కారులో నుంచి దిగిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆ వీడియోలో ఉన్నది పరిశ్రమల మంత్రి ఎస్ కీర్తన( Minister Keerthana) అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. డీఎంకే అభిమానులు ఆ పోస్టును వైరల్ వేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ దుమారానికి తెరలేపింది. ఆ ఘటన పట్ల మంత్రి కీర్తన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. ఆ వీడియోలో ఉన్న మహిళ తాను కాదు అని, కానీ ఒకవేళ అది తానే అయినా దాంట్లో ఇబ్బంది ఏంటని ఆమె ప్రశ్నించారు. మంత్రి కీర్తన తన ఎక్స్ అకౌంట్లో కామెంట్ చేస్తూ.. సమాజానికి ఏమీ చేయలేని వారు స్త్రీలను ద్వేషిగా చూస్తారని, అది వారి పురాతన ఆయుధమని ఆమె విమర్శించారు.
శివకాశీకి చెందిన ఎమ్మెల్యే కీర్తన తనపై వస్తున్న ట్రోలింగ్‌కు కౌంటర్ ఇచ్చారు. ఓ మహిళ గురించి రాజకీయ ప్రేలాపనలు సరిగా కాదు అని ఆమె అన్నారు. అది వారి కుంచిత స్వభావాన్ని బయటపెడుతుందన్నారు. మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఆ పార్టీకి ముఖ్య నేతగా ఉన్నప్పుడు, ఇక ఆ పార్టీ మద్దతుదారుల నుంచి ఇంతకన్నా ఎక్కువగా ఏమి ఆశిస్తామని ఆమె విపక్షానికి కౌంటర్ ఇచ్చారు. మహిళల దుస్తులు, లుక్ గురించి ఎందుకు ఇంకా పబ్లిక్‌గా రచ్చ చేస్తారని ఆమె అన్నారు.
ప్రభుత్వ విధానాలను, పరిపాలనను, ట్రాక్ రికార్డును ఎదుర్కొలేని విపక్ష నేతలు.. వ్యక్తిగత జీవితాలను, కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తుంటారని ఆమె ఆరోపించారు. వీడియోలో ఉన్న మహిళ తనలాగే ఉందని పోల్చుతూ ఆ మహిళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని ఆమె అడిగారు. కానీ ఆ వీడియోలో ఉన్న మహిళ స్టన్నింగ్‌గా ఉందని, నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని ఆశిస్తున్నట్లు మంత్రి తన కామెంట్లో పేర్కొన్నారు.