Athens Wildfire | ఏథెన్స్ (గ్రీస్), ఆగస్టు 12: గ్రీస్ రాజధాని ఏథెన్స్ను కార్చిచ్చు చుట్టుముట్టింది. భారీ స్థాయిలో మంటలు నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏథెన్స్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి.. మంటలను ఆర్పేందుకు 500 మంది అగ్నిమాపక సిబ్బందిని మోహరించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన కార్చిచ్చు.. 20 గంటలు గడిచినా అదుపులోకి రావటం లేదు. ఇప్పటికే 150కిపైగా అగ్నిమాపక యంత్రాలు, 30 వరకు నీళ్లు చిమ్మే విమానాలను రంగంలోకి దించారు.
పొగకు చాలామంది అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరారు. బలమైన గాలులు వీయటంతో మంటలు వేగంగా ఏథెన్స్ను సమీపిస్తున్నాయని ఆ దేశ మంత్రి వాసిలిస్ కికిలియాస్ వెల్లడించారు. ఒక్కోచోట మంటలు 90 అడుగుల ఎత్తుతో దూసుకొస్తున్నాయని వివరించారు. 2018లోనూ ఇలాంటి కార్చిచ్చే గ్రీస్‌లో అల్లకల్లోలం రేపింది. ఆ సమయంలో సముద్ర తీరంలో ఉన్న మాటి నగరం మొత్తం బూడిదైపోయింది. దాదాపు వంద మందికిపైగా మరణించారు. గ్రీస్ వాతావరణం వేడిగా ఉండటం వల్ల ఇక్కడ కార్చిచ్చు సాధారణం అయిపోయింది.