పేలుడులో చిక్కుకున్న చిన్నారి. పసిప్రాణం కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న అంబులెన్సు సిబ్బంది. పేగుబంధం ఆ నాటితో తెగిపోతుందేమో అనే బాధ, భయంతో కన్నీళ్లతో అంబులెన్సు బయట నిలబడిన తల్లి.. ఉక్రెయిన్లో తాజాగా కనిపించిన హృదయ విదారక దృశ్యమిదీ.
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణలో ఇప్పటి వరకు ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో దృశ్యం ప్రపంచ ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది. రష్యా వేసిన బాంబు పేలుడులో ఒక చిన్నారికి తీవ్రమైన గాయాలయ్యాయి. పారామెడికల్ సిబ్బంది ఆ చిన్నారిని అంబులెన్సులో ఎక్కించుకొని ప్రథమ చికిత్స అందిస్తున్నారు.
ఆ సమయంలో చిన్నారి తల్లి.. రక్తసిక్తమైన చేతులతో అంబులెన్సు బయటే నిలబడి కళ్ల నిండా నీళ్లతో.. దుఃఖాన్ని అణుచుకోవడానికి చేత్తో నోటిని అదుముకుంటూ కనిపిస్తోంది. ఆమె చేతిలో పింక్ కలర్లో తన చిన్నారి స్కార్ఫ్ ఉంది. దాన్ని పట్టుకొని ఆ తల్లి ఏడుస్తున్న దృశ్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హృదయాలను కలచి వేస్తోంది. ఆ తల్లి బాధను చూసిన వాళ్లంతా ఆమెకు తమ సానుభూతి తెలుపుతున్నారు. ఆ తల్లి బాధను మాటల్లో చెప్పలేమంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాదు, మరో కుటుంబంలో కూడా ఈ యుద్ధం తీరని శోకం మిగిల్చింది. రష్యా క్షిపణులతో దద్దరిల్లుతున్న కీవ్ నుంచి పారిపోయేందుకు ఒక కుటుంబం ప్రయత్నించింది. వారిలో పోలినా అనే 4వ గ్రేడ్ చిన్నారి, ఆమె తమ్ముడు, చెల్లి, తల్లిదండ్రులు ఉన్నారు. వారంతా వెళ్తున్న కారుపై రష్యన్ దళాలు కాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల్లో పోలినా అక్కడికక్కడే కన్నుమూసింది. ఆమె తల్లిదండ్రులు కూడా దుర్మరణం పాలయ్యారు. పోలినా అక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతోంది. తమ్ముడు కూడా మరో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ చిన్నారి ఇలా మరణించడం యుద్ధం మిగిల్చే శోకాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తోంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో 14 మంది చిన్నారులు కన్నుమూసినట్లు అంచనా.