హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/పాల్వంచ/ మణుగూరు టౌన్: నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రంలోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణ ప్రక్రియను టీజీ జెన్కో వేగవంతం చేస్తున్నది. టెండర్ల ఖరారుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఉద్యోగులు, ఇంజినీర్లు ఎంతగా వ్యతిరేకిస్తున్నా ముందుకెళ్తున్నది. మూడేండ్ల కాలానికి రూ.279 కోట్లకు టెండర్లు ఖరారు చేశారు. ఎల్-1గా నిలిచిన సంస్థకు ఒకట్రెండు రోజుల్లో టెండర్లు కట్టబెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు శుక్రవారం మెరుపు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని అన్ని విద్యుత్తు ప్లాంట్లతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల సీఈ, ఎస్ఈ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇంజినీర్లు, ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లు ఏకమై జెన్కో యాజమాన్యం వైఖరిని నిరసించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లోని సీఈ చాంబర్లో కార్మికులు, ఇంజినీర్లు, ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు బైఠాయించారు. మణుగూరు బీటీపీఎస్‌లోని సీఈ చాంబర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ చీఫ్ ఇంజినీర్ బిచ్చన్నను నిర్బంధించారు. జాక్ నాయకులు మాట్లాడుతూ.. గత నెల 29న జరిగిన సమావేశంలో ప్రభుత్వంతో మాట్లాడి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా మళ్లీ టెండర్లు పిలవడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరితో చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని, ప్రైవేటీకరణ టెండర్‌పై జెన్కోలోని ఇద్దరు డైరెక్టర్ల సంతకాలు కూడా చేసినట్టు తమకు సమాచారం ఉన్నదని పేర్కొన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.