టెహ్రాన్: దేశవ్యాప్తంగా సామూహిక తిరుగుబాటు చేయాలని ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లావీ ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సిటీ సెంటర్లను ముట్టడించాలని, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో సమ్మెలు చేయాలని కోరారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను పతనం చేయడానికి వీధుల్లో నిరసనలు చేపట్టాలన్నారు. ‘ద్రోహి, క్రిమినల్ అయిన ఇస్లామిక్ రిపబ్లిక్ నేత బెదిరింపులకు దీటైన సమాధానం మీరంతా వీధుల్లోకి పెద్ద ఎత్తున రావడమే’ అని వారి నిరసనలను ప్రశంసించారు. ఈ నిరసనలు చూసిన తర్వాత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భయంతో వణికిపోతున్నారన్నారు. ఇకపై నిరసనలు మరింత సునిశిత లక్ష్యంతో, విధ్వంసకరంగా జరగాలన్నారు. రవాణా, చమురు, గ్యాస్, ఎనర్జీ సహా ముఖ్యమైన రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడం వల్ల అసమ్మతిని అణచివేసే సామర్థ్యాన్ని ప్రభుత్వం కోల్పోతుందని చెప్పారు. వారాంతంలో మళ్లీ నిరసనలు చేపట్టాలని కోరారు. తాను కూడా స్వస్థలానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. జాతీయ విప్లవ విజయోత్సవ సమయానికి మీ పక్కనే ఉండే విధంగా వస్తానన్నారు. ఇరాన్లో రెండు వారాల నుంచి నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో పహ్లావీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ సంక్షోభంపై పహ్లావీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యాన్ని కోరారు.
నిరసనల్లో 200 మంది మృతి?
ఇరాన్లో రాజకీయ, ఆర్థిక మార్పుల డిమాండ్‌తో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దేశాధినేత అయతొల్లా ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. టెహ్రాన్‌లోని ఆరు దవాఖానల్లో దాదాపు 217 మంది మరణించారని ఓ వైద్యుడు తెలిపారు. ఉత్తర టెహ్రాన్ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకారులపై భద్రతా దళాల కాల్పుల్లో 40 మంది మరణించినట్లు ఆయన తెలిపారు.
భారత్ బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రభావం
ఇరాన్లో ప్రజల ఉద్యమాల ప్రభావం భారత దేశం నుంచి ఎగుమతి అవుతున్న బాస్మతి బియ్యంపై పడింది. ఇరాన్‌కు ఎగుమతి చేయాల్సిన సుమారు రూ.2 వేల విలువైన ప్రీమియం బాస్మతి బియ్యం భారత గోదాముల్లో నిలిచిపోయాయి. ఇరాన్ స్పష్టమైన హామీ ఇస్తేనే వీటిని ఎగుమతి చేస్తారు. మన దేశంలో పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో బాస్మతి బియ్యం ఎక్కువగా పండుతాయి. డాలర్‌తో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ తీవ్రంగా పతనమైంది. మన దేశం నుంచి బాస్మతి బియ్యాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం ఇరాన్. ఏటా దాదాపు 12 లక్షల టన్నుల బియ్యాన్ని ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. వీటి విలువ సుమారు రూ.12,000 కోట్లు.
సిగరెట్లు తాగుతూ ఇరాన్ మహిళల నిరసన
ఇరాన్ ప్రభుత్వంపై ఉద్యమిస్తున్న నిరసనకారులు వినూత్న రీతుల్లో తమ నిరసనను తెలియజేస్తున్నారు. మహిళలు సిగరెట్లు తాగుతూ, ఇరాన్ అధినేత అయతొల్లా ఖమేనీ ఫొటోలను కాల్చేస్తున్నారు. ఈ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఇరాన్లో 1989 నుంచి ఖమేనీ పాలన కొనసాగుతున్నది. ఆయన పాలనలో మహిళలపై తీవ్రమైన ఆంక్షలను అమలు చేశారు.సంప్రదాయాలను పాటించని మహిళలను నిర్బంధించి, హింసించారు. దీంతో ప్రజలు గత పాలకుడు షా వారసుడు రెజా పహ్లావీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేయాలని కోరుకుంటున్నారు.