Dinosaur Skeleton | ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్లలో ఒకటైన వల్కాన్ను ఈ నెల 16న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వేలం వేయనున్నారు. డైనోసార్ అస్థిపంజరం బిడ్ నమోదు కాకముందే ధర 11 నుంచి 22 మిలియన్ అమెరికా డాలర్లు (దాదాపు రూ.92 నుంచి రూ.185కోట్లు) దాటిందని ఫ్రెంచ్ వేలం నిర్వాహకుడు కొలిన్ డు బోకేజ్ అండ్ బార్బరోస్సా పేర్కొన్నారు. ఈ స్కెలిటన్ 2018 యూఎస్ఏలోని వ్యోమింగ్‌లో గుర్తించారు. దాని పరిమాణం 20.50 మీటర్లు.. ఇందులో 80శాతం ఎముకలు డైనోసార్‌కు చెందినవి. వల్కాన్ డైనోసార్ లక్షణాలు అపాటోసారస్, బ్రోంటోసారస్లా ఉంటాయి. వల్కాన్ అతిపెద్ద డైనోసార్. ఇది జీవితకాలంలో అత్యంత పురాతనమైన ఆవిష్కరణ అని కొలిన్ డు బోకేజ్ వ్యవస్థాపకుడు, వేలంపాట నిర్వాహకుడు ఆలివర్ కొలిన్ డు బోకేజ్ పేర్కొన్నారు.
కొనుగోలుదారుకు జీపీఎస్ పాయింట్లతో పాటు నమూనా కాపీరైట్, త్రవ్వకాల ప్రణాళికతో పాటు అధికారికంగా డైనోసార్ పేరు మార్చే హక్కు ఉంటుంది. వల్కాన్ను ప్రఖ్యాత పాలియోంటాలజీ నిపుణులు సైతం అధ్యయనం చేశారు. ఇందులో జర్మనీలోని రోస్టాక్ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టియన్ ఫోత్ సైతం ఉన్నారు. ఆయన ఇటీవల కొత్త డైనోసార్ జాతి నమూనాలను వెల్లడించారు. వల్కాన్ డైనోసార్ లక్షణాలు అపాటోసారస్, బ్రోంటోసారస్ రెండింటికీ సరిపోతున్నాయి. దాని లక్షణాలు అజాక్స్‌తో సమానంగా ఉంటాయి. శిలాజ నేల పొరలో లభించే పదార్థం ఆధారంగా దీన్ని శాకాహారిగా వర్గీకరించారు. భారీ డైనోసార్‌ను ప్యారిస్‌లోని చాటో డీ డాంపియర్ ఎన్ వైలైన్స్లో ప్రదర్శించారు. జులైలో ఎగ్జిబిషన్ ప్రారంభించినప్పటి నుంచి 40వేల మందికిపైగా సందర్శకులు దీన్ని చూసేందుకు వచ్చారు. ఇది నవంబర్ 3 నుంచి 16 వరకు సందర్శనకు అందుబాటులో ఉంటుంది.